పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0370-01 దేవగాంధారి సం: 04-410 శరణాగతి

పల్లవి:

ఇందుకు ధ్రువాదు లిటు సాక్షి
చెంది నమ్మవో జీవుఁడ నీవు

చ. 1:

కొండలవంటివి ఘోరపాపములు
ఖండించును హరి ఘన నామ జపము
నిండించును మతి నిత్యానందము
పండించునపుడె పరమపదంబు

చ. 2:

జలధులవంటివి జననబంధములు
తొలఁగించును హరితూరిన భక్తిది
వెలిఁగించును ఘన విజ్ఞానంబులు
చెలఁగించును బహు సిరిసంపదలు

చ. 3:

తోవరాని బహుదుఃఖము లణఁచును
శ్రీ వేంకటపతిఁ జేరిన శరణము
పావనంబుగాఁ బచరించు గుణము
కైవశమగు లోకములెల్లాను