పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-02 శుద్ధవసంతం సం: 04-394 వైరాగ్య చింత

పల్లవి:

ఏమని చెప్పెద నిటమీఁద హరీ
శ్రీ మంతుఁడ నినుఁ జేరితి మిదివో

చ. 1:

వినుచున్నారము వెనకటిపాట్లు
కనుచున్నారము కలఁగేటివారల
దిన దిన భావము తెలిసీఁ దెలియదు
మనసున భయ మిసుమంతయు లేదు

చ. 2:

భువి నెరుఁగుదు మిదె పుట్టెడి దెసలను
తవిలి మరణములు దలఁచెద మట్లనె
వివరపు టాసలు విడిచీ విడువవు
నవమగు విరక్తి నాఁటదు వోయె

చ. 3:

చదివెద మిదివో సకల శాస్త్రములు
వెదకెద మిదె శ్రీ వేంకటేశ నిను
మదిలోనుండగఁ మరచివుంటి మిదె
యెదుటఁగంటి మిఁక యేలాపనులు