పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-01 బౌళి సం: 04-౩93 దశావతారములు

పల్లవి:

ఓహో యెంతటివాఁడే వొద్దనున్నవాఁడే హరి
సాహసపు గుణముల చతురుఁడా యితఁడు

చ. 1:

జలధిలోఁ బవళించి జలనిధి బంధించి
జల నిధి కన్యకను సరిఁ బెండ్లాడి
జలనిధిలో నీఁది జలనిధి మధియించి
జలధి వెరించిన చలమరా యితఁడు

చ. 2:

ధరణికిఁ బతియై ధరణి గ్రుంగిన నెత్తి
ధరణికూఁతురుఁ దానె తగఁ బెండ్లాడి
ధరణిఁ బాదము మోపి ధరణి భారము దించి
ధరణీ ధరుఁడైన దైవమా ఇతఁడు

చ. 3:

కొండ గొడుగుగ నెత్తి కొండఁ దూఁటువడ నేసి
కొండకిందఁ గుదురై కూచుండి
కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటిరాయఁడై
కొండ వంటి దేవుఁడైన కోవిదుఁడా ఇతఁడు