పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0367-03 లలిత సం: 04-395 శరణాగతి

పల్లవి:

ఆచార విచారా లవియు నే నెరఁగ
వాచామ గోచరపు వరదుఁడ నీవు

చ. 1:

తపమొక్కటే నాకుఁ దగు నీ శరణనుట
జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట
వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ

చ. 2:

కర్మమొక్కటే నీ కైంకర్యగతి నాకు
ధర్మమొక్కటే నీ దాసాను దాస్యము
మర్మమొక్కటే నా మతి నిన్నుఁ దలఁచుట
అర్మిలి నింతకంటే నవల నే నెరఁగ

చ. 3:

బలిమియొక్కటే నాకు భక్తి నీపైఁ గలుగుట
కలిమి యొక్కటే నీవు గలవని నమ్ముట
యెలమితో శ్రీ వేంకటేశ నీవు గతిదక్క
పలుబుద్దులు నేఁబొరలు భావనలేనెరఁగ