పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-06 బౌళి సం: 04-362 వైరాగ్య చింత

పల్లవి:

మానదు మతిమఱపునుఁ దెలివియు
యేనింక దైవమ యేమిసేయుదును

చ. 1:

సకల పురాణాలు శాస్త్రాలు విని విని
వొక వేళ సుజ్ఞాన మొదవును
వికటమై యంతలో విషయసుఖము గని
ఆకట కమ్మర బుద్ధి నవే కతలు

చ. 2:

పలు దుఃఖముల బాధఁబడు వారిఁ బొడగని
పలికి సంసారముపై రోసును
నలవంక సిరులలో నటియించువారిఁ జూచి
తలఁచి యాసలవెంటాఁ దగులు నంతటను

చ. 3:

యెడప కలమేల్మంగ యీ రీతి నిన్నునే
బడి బడి యలసి తిట్టె పైపై నింక
చిడుముడి నీ మీఁద శ్రీ వేంకటేశ్వర
తడవి యిట్లదయ దలఁచ కుండినను