పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-05 పాడి సం: 04-361 వైరాగ్య చింత

పల్లవి:

కలకాలము నిట్టేకాఁపురపు బదుకాయ
యిలదైవమా నాకెన్నఁడో నిశ్చయము

చ. 1:

గుట్టుతో వైరాగ్యమే కోరుదు నే నొకవేళ
ఱట్టున సంసారపుటాఱడి గోరుదు
ముట్టుపడి యొకచోట మనసెందు నిలువదు
యిట్టె చెంచెలుఁడ నాకు నెన్నఁడో నిశ్చయము

చ. 2:

కొంతవడి నే సత్త్వగుణమందు నెలకొందు
అంతలో రాజస గుణినై యుందును
చెంత దామసగుణము చేకొందు నొకవేళ
యింత పలువంచలు నా కెన్నఁడో నిశ్చయము

చ. 3:

వివరించి యొకవేళ వివేకివలె నుందు
ఆవల మూఢుఁడనవుదు నంతటిలోనే
తవిలి శ్రీ వేంకటేశ తగ నిన్ను దలఁచంగ
యవలఁ దొల్తేయాయ నెన్నఁడో నిశ్చయము