పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-04 లలిత సం: 04-360 శరణాగతి

పల్లవి:

బల్లిదులు నీకంటెఁ బరులున్నారా నన్నుఁ
దొల్లిటిబారి నింకఁ దోయకు మోయయ్య

చ. 1:

చిక్కుల భవములఁ జెరఁజిక్కి వోపలేక
నిక్కి నీమరఁగు చొచ్చి నిలిచితిని
అక్కజమై యల్లనాఁడే అప్పులకర్మములెట్ల
ఇక్కడనె చుట్టుముట్టీ నేమిసేతునయ్యా

చ. 2:

లచ్చి సంసారమునకు లగ్గమచ్చి తీరలేక
యిచ్చట నిన్నుఁగొలిచి యెక్కువై తిని
పొచ్చముల నల్లనాఁటిపూఁట దీరదని కొన్ని
బచ్చన బంధాలు వచ్చెఁ బాఁపగదవయ్య

చ. 3:

అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక
ముంచి నీ పాదాలకు మొరవెట్టితి
పొంచిన శ్రీవేంకటేశ భువన రక్షకుఁడవు
పంచల నున్నాఁడ నన్నుఁ బాలించవయ్యా