పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-03 సామంతం సం: 04-359 వేంకటగానం

పల్లవి:

ఎల్లలోకములవారి కేలిక దానే
కొల్లగా వరములిచ్చే గురుతైన దైవము

చ. 1:

కొండల కోనల లోన కోనేటి సరిదండ
మెండైన బంగారు మేడలలోన
నిండు జవ్వనము తోడి నెలఁత కౌఁగిటలోన
వుండి జగమెల్ల నేలీ నుద్దండ దైవము

చ. 2:

నాలుగు చేతుల తోడ నవ్వుల మోముతోడ
సోలి సంకుఁజక్రముల సొంపుతోడ
నేలమిన్నునొకటై నిలుచున్న రూపుతోడ
పాలుపడి మెరసీని ప్రత్యక్ష దైవము

చ. 3:

సంపదలు కడుమించి చవులతో నారగించి
జొంపపు విరుల పూజ సొంపుమించి
యింపుల శ్రీవేంకటాద్రి నిరవై వున్నాఁడు వీఁడె
పంపుడు దేవతలతోఁ బ్రతిలేని దైవము