పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0361-02 లలిత సం: 04-358 వేంకటేశ్వరౌషధము

పల్లవి:

అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము

చ. 1:

చిత్తశాంతికిని శ్రీ పతి నామమె
హత్తిననిజ దివ్యౌషధము
మొత్తపు బంధవిమోచనంబునకు
చిత్తజ గురుఁడే సిద్దౌషధము

చ. 2:

పరిపరి విధముల భవ రోగములకు
హరిపాద జలమె యౌషధము
దురితకర్మములఁ దొలఁగించుటకును
మురహర పూజే ముఖ్యౌషధము

చ. 3:

యిల నిహపరముల నిందిరావిభుని -
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధము