పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0౩60-01 లలిత సం: 04-351 వైరాగ్య చింత

పల్లవి:

దైవమే నేరుచుఁగాక తగిలించ విడిపించ
యీవల సంసారికి నేమిసేయ వచ్చును

చ. 1:

ఆస యెచ్చోట నుండు నక్కడ దైన్యము నుండు
వాసులన్నీ నెందు నుండు వన్నెలు నందుండు
వేసట యెక్కడ నుండు వీతరాగ మాడనుండు
యీసుల నీలంకెవాప నెవ్వరికిఁ దరము

చ. 2:

అతికోప మేడనుండు నజ్ఞాన మాడనుండు
మతిఁ బంత మెందుండు మత్సర మందుండు
మతకము లేడనుండు మాయలును నందు నుండు
యితరు లెవ్వరు నిందు కేమనఁగలరు

చ. 3:

తనభక్తి యెందుండు తపమును నందుండు
మనసెందు నుండు దీమసమును నందుండు
తనివి యొక్కడ నుండు తగు సుఖ మందుండు
తనర శ్రీ వేంకటేశు దైవికము లివియే