పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-02 ముఖారి సం: 04-352 దశావతారములు

పల్లవి:

వింతనా నేఁ దనకు వేసాలవాఁడు
కంతునికి గురుఁ డనగలిగినవాఁడు

చ. 1:

జడిగొని మొదలఁ దా జలసూత్రపువాఁడు
వెడమాయలుగ బారి విద్యలవాఁడు
కడుసోద్యములనే కర్మపుఁ జేఁతలవాఁడు
అడరి కంభపుసూత్ర మాడెడివాఁడు

చ. 2:

యిలనుండి మిన్ను ముట్టే యింద్రజాలములవాఁడు
తల ద్రుంచి బ్రదికించుతక్కులవాఁడు
తెలియఁ గొండలు నీళ్ళఁ దేలవేసినవాఁడు
కలసి పగలు రేయిగాఁ జేసేవాఁడు

చ. 3:

మగువల భ్రమ యించే మౌన వ్రతముల వాఁడు
వెగటై రాయి గంతులు వేయించేవాఁడు
చిగిరించే వరముల శ్రీ వేంకటాద్రివాఁడు
బగివాయ కిట మమ్ముఁ బాలించేవాఁడు