పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-06 సామంతం సం: ౦4-350 దశావతారములు

పల్లవి:

ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు
కందువ నిధానమవై కలవుగా నీవు

చ. 1:

అరసి ధ్రువుని గాచినట్టి వీవు
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచిన నీవు
కరిరాజు శరణంటేఁ గాచిన నీవు
కరతలామలకమై కలవుగా వీవు

చ. 2:

గట్టిగా విభీషణుఁగాచిన నీవు
అట్టె ద్రౌపదిఁ గాచినప్పటి నీవు
చెట్టవట్టి బలిఁగాచిన నీవు నాకు
కట్టిన ముడుపవై కలవుగా నీవు

చ. 3:

కమ్మర సుగ్రీవునిఁ గాచిన నీవు నేఁడు
కిమ్ముల లోకములు రక్షించే నీవు
నెమ్మది శ్రీ వేంకట నిలయ నీవు మాకు
కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు