పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-02 గుండక్రియ సం: 04-340 శరణాగతి

పల్లవి:

ఎన్నిటికెన్నిటికని యెక్కడఁ దగిలెదము
మన్నించు దేవ మాకుఁజాలు

చ. 1:

ముఖరమై మాఁకులకు మొదలఁబోసిననీరు
శిఖలకుఁ దనువెక్కి చిగిరించినయట్టు
నిఖిలప్రయోజనాలు నీమూలమేకాన
మఖపతి మీసేవే మాకుఁజాలు

చ. 2:

వరుసలనిన్నిటా వన్నె బంగారమే
పరపరివిధముల పలుసొమ్ములైనట్లు
నిరతిఁ గర్మఫలాలు నీమూలమేకాన
మరుగురుఁడవు నీవే మాకుఁజాలు

చ. 3:

వెలయ శ్రీవేంకటేశ వివిధజంతువులకు
అలవిలేనిభూమే యధారమైనట్లు
నెలవు దేవతలకు నీవేలికవుగాన
మలసి నీశరణమే మాకుఁజాలు