పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-01 గుండక్రియ సం: 04-339 వైరాగ్య చింత

పల్లవి:

నాఁటకమింతా నవ్వులకే
పూఁటకుబూఁటకుఁ బొల్లైపోవు

చ. 1:

కోటివిద్యలునుఁ గూటికొఱకె పో
చాటువ మెలఁగేటి శరీరికి
తేటల నాఁకలిదీరినపిమ్మట
పాటుకుఁ బాటే బయలైపోవు

చ. 2:

మెఱసేటిదెల్లా మెలుఁతలకొరకే
చెఱలదేహములజీవునికి
అఱమరపుల సుఖమందినపిమ్మట
మొఱఁగుకుమొఱఁగే మొయిలై పోవు

చ. 3:

అన్ని చదువులును నాతనికొరకే
నన్నెరిఁగిన సుజ్ఞానికిని
యిన్నిట శ్రీవేంకటేశుదాసునికి
వెన్నెలమాయలు విడివడిపోవు