పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-06 ముఖారి సం: 04-338 శరణాగతి

పల్లవి:

ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ
జాలిదీర నీకే శరణుచొచ్చితిమి

చ. 1:

గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే
పతియు నీవే యేపట్టునా మాకు
యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్నుఁబోల
చతురుఁడ నిన్నునే శరణుచొచ్చితిమి

చ. 2:

జననీజనకులు శరణము నీవే
వునికి మనికి నీవే వుపము నీవే
మనసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే
చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి

చ. 3:

లోకసాక్షివి నీవే లోకబంధుఁడవు నీవే
యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె
నీకంటె మరిలేరు నిఖిలమింతయుఁ గావ
సాకారరూప నీకే శరణుచొచ్చితిమి