పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-05 లలిత సం: 04-337 అంత్యప్రాస

పల్లవి:

దేవునిమరవకు మంతే మాట చిత్తమా
దీవెనై కలఁడు మాకు దేవుఁడు

చ. 1:

అరుదగుజీవుని బ్రహ్మాండగోళములోన
తెరఁగై పుట్టించువాఁడు దేవుఁడు
అరసి కమ్మరవచ్చి యన్నపానాదులు వెట్టి
తిరుగ రక్షించువాఁడు దేవుఁడు

చ. 2:

బలుసంసారములోన భ్రమసియుండిన మాకుఁ
దెలిపి చెప్పినవాఁడు దేవుఁడు
తెలియనికర్మములు తెగనిబంధాలు వాపి
తిలకించి కాచువాఁడు దేవుఁడు

చ. 3:

తల్లియుఁ దండ్రియునై దాతయై కలఁడు మాకు
తెల్లమి శ్రీవేంకటాద్రిదేవుఁడు
మల్లాడి తనదాసులమతిలోఁ దా నుదయించి
తెల్లవారించేవాఁడు దేవుఁడు