పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-04 రామక్రియ సం: 04-336 దశావతారములు

పల్లవి:

నమ్మితే నితఁడే మన్ననఁ గాచు
యిమ్ముల ధ్రువుని బట్టమేలించినట్లు

చ. 1:

తీరని కర్మములైన దీరుఁబో శ్రీహరిపాద -
మేరీతిఁ గొలిచినా నెవ్వరికిని
చేరరాని యడవిలో శిలలై పడియున్న
భారపుటహల్యశాపము దేరినట్లు

చ. 2:

కలుగనిసిరులెల్లఁ గలుగుఁబో శ్రీహరి
గొలిచినవారికిఁ గోరినట్లే
అలనాఁడు దరిద్రుఁడైన కుచేలుని
బలుసంపదలఁ దెచ్చి బతికించినట్లు

చ. 3:

చూడఁగా మూఢులకైన సులభుఁడై నిలుచుఁబో
వేడుకతోఁ బాడితే శ్రీవేంకటేశుఁడు
యాగనే మాబోంట్లకు నిరవై కోనేటిదండ
మేడెపువరములెల్ల మెచ్చి యిచ్చినట్లు