పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-03 సాళంగనాట సం: 04-335 అంత్యప్రాస

పల్లవి:

ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను
మన్నించి నీమనసు మరిగించు మనసు

చ. 1:

పొలఁతులకాఁకనే పుటమెక్కె మనసు
చలివేఁడిజవ్వనమునందిఁ జిక్కె మనసు
వలరాజుతూపునంజు వడినెక్కె మనసు
మలసి రతిసుఖాలమరపాయ మనసు

చ. 2:

పచ్చనికనకముపై భ్రమఁబడె మనసు
చిచ్చువంటివిషయాల శివమెత్తె మనసు
వొచ్చెపుఁ బాపాలకెల్లా నొడిగట్టె మనసు
బచ్చన చెంచెలములఁ బాటిచెడె మనసు

చ. 3:

కోరి యంతలో గురుఁడు గూఁటవేసె మనసు
వోరుపుతో నీపాలి కొప్పగించె మనసు
ఈరీతి శ్రీవేంకటేశుఁడ నామనసు
తోరపు విజ్ఞానము తుదకెక్కె మనసు