పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-02 ముఖారి సం: 04-328 మనసా

పల్లవి:

దిక్కులేనివారు నీవే దిక్కని కొలువఁగా
అక్కరకితఁడు దైవమందురువో నిన్నును

చ. 1:

పాలుపడి నిన్నుఁజేరి పట్టి కొలిచినవారి
జాలిపాటు తొలఁగించి జడనువాపి
మూలఁబడనీక తెచ్చి ముద్దుసేసికావఁగాను
మేలెరుఁగుబుధులెల్ల మెత్తురువో నిన్నును

చ. 2:

కొండలుఁ గోట్లునైన కోరికలు గలవారి -
యండనే కోరికలిచ్చి యాదరించగా
నిండినదాసులకెల్ల నీవే దైవ మవని
కొండమీఁదనుండినఁ బైకొందురువో నిన్నును

చ. 3:

యేకమైనమనసుతో నెవ్వరు దలచినాను
చేకొని కరుణఁ గృపసేయఁగాను
యేకాలము శ్రీవేంకటేశుఁడు మాదైవమని
లోకమెల్లఁ దామే కొలుతురువో నిన్నును