పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-02 ముఖారి సం: 04-310 నృసింహ

పల్లవి:

నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభములొసఁగెను

చ. 1:

సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనక కశిపుని

చ. 2:

నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచిరక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను

చ. 3:

కాంచనపు గద్దె మీఁద గక్కనఁ గొలువై యుండి
మించుగ నిందిరఁ దొడమీఁద బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో