పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-01 భల్లాటి సం: 04-309 నృసింహ

పల్లవి:

పెదయౌబళపుఁగొండఁ బెరిగీనిదే
వదలకకొలిచితే వరములిచ్చీని

చ. 1:

పదివేలశిరసుల బలునరసింహము
గుదిగొన్నచేతుల గురుతైనది
ఎదుటఁ బాదాలుఁ గన్నులెన్నైనఁ గలిగినది
యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది

చ. 2:

ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది
మొనసి రాకాసిమెకములఁ గొట్టేది
కనకపుదైత్యుని కడుపుచించినది
తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది

చ. 3:

శ్రీవనితఁ దొడమీఁదఁ జేకొని నిలిపినది
దేవతలు గొలువ గద్దెపై నున్నది
శ్రీవేంకటాద్రియందుఁ జెలఁగి భోగించేది
భావించి చూచితేను పరబ్రహ్మమైనది