పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-03 సామంతం సం: 04-311 వేంకటగానం

పల్లవి:

దైవమొక్కఁడే సంతత భజనీయుఁడు
భావము సమబుద్దిఁ బాయఁగఁదగదు

చ. 1:

హరియే నకలాంతరాత్మకుఁ డటుగాన
తిరమై యొకరి నిందింపఁదగదు
అరయఁగ లోకములనిత్య మటుగాన
మరిగి కొందరిమీఁది మమతయు వలదు

చ. 2:

బహుకల్పితములెల్లఁ బ్రకృతిమూలమే కాన
గహనపుఁదన వుద్యోగము వలదు
సహజవిహారుఁడు సర్వేశ్వరుఁడుగాన
వహిఁ దానేవచ్చినవి వలదనఁదగదు

చ. 3:

తపములు జపములు దాస్యమూలమె కాన
వుపమల సందేహమొగి వలదు
యెపుడును శ్రీవేంకటేశ్వరు సేవించి
చపలచిత్తమువారి సంగమిఁక వలదు