పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-04 భైరవి సం: 04-306 దశావతారములు

పల్లవి:

ఈతఁడు విష్ణుఁడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు
చేత చక్రమెత్తినాఁడు శ్రీవేంకటేశుఁడు

చ. 1:

జలధులు చొచ్చిచొచ్చి సారెఁ బ్రతాపించినాఁడు
చలమునఁ బాతాళము సాధించినాఁడు
బలుభూమిదూరి వొక్కకొలికికిఁ దెచ్చినాఁడు
నిలిచి యంతరిక్షమునిండి భేదించినాఁడు

చ. 2:

చేరి బ్రహ్మాండము తూఁటుసేసి చూచినాఁడు
వీరుఁడై రాచమూఁకల వెదకినాఁడు
ఘోరపుత్రికూటాదికొండలు జయించినాఁడు
వారించి చక్రవాళపర్వతము దాఁటినాడు

చ. 3:

మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాఁడు
చుట్టువేడెమున యింతా సోదించినాఁడు
యిట్టె శ్రీవేంకటాద్రినిరవై యెక్కినవాఁడు
రట్టుగాఁ దనదాసులనిట్టె రక్షించినాఁడు