పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-03 హిందోళం సం: 04-305 శరణాగతి

పల్లవి:

కరుణానిధివి గట్టుకో యేపుణ్యమైన
శరణాగత వజ్రపంజరుఁడవు నీవు

చ. 1:

మన్నించేనంటే నిన్ను మానిపేవా రెవ్వరు
పన్ని కోపగించితే నీపట్టుకెదు రెవ్వరు
చెన్నుమీర నీపెట్టుజెట్లే జీవులెల్లాను
వన్నెగా నీసొమ్ము నీవువలసినట్టు సేయి

చ. 2:

కాచేనంటే నిన్నుఁ గాదనేవా రెవ్వరు
ఏచి యాజ్ఞవెట్టేనంటే యిదేలనేవా రెవ్వరు
లాచి పెంపుడుగుఱ్ఱలు లలినీజీవులెల్లాను
చేచేత నీదాసులను సేసినట్టుసేయి

చ. 3:

పరమిచ్చేనంటే నడ్డపడేవా రెవ్వరు
సరి నిహమిచ్చేనంటే సాధించేవా రెవ్వరు
సిరుల శ్రీవేంకటేశ చేతిలోవారము నీకు
హరి నీపాఁతవారమెట్టైనా దయసేయి