పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-02 వసంతం స౦: 04-౩04 కృష్ణ

పల్లవి:

తల్లియాపె కృష్ణునికిఁ దండ్రి యీతఁడు
చల్లఁగా లోకములెల్లా సంతోసమందెను

చ. 1:

అరుదై శ్రావణబహుళాష్టమినాటిరాత్రి
తిరువవతారమందెను కృష్ణుఁడు
యిరవై దేవకిదేవి యెత్తేకొని వసుదేవు -
కరములందుఁ బెట్టితే కడుసంతోసించెను

చ. 2:

తక్కక యమునానది దాఁటతఁడు రేపల్లెలో
పక్కన యశోదాదేవిపక్కఁ బెట్టెను
యెక్కువనాపె కృష్ణునినెత్తుక నందగోపుని
గక్కన వినిపంచితే కడుసంతోసించెను

చ. 3:

మరిగి పెద్దై కృష్ణుఁడు మధురలోఁ గంసుఁజంపి
బెరసి యలమేల్మంగఁ బెండ్లాడి
తిరమై శ్రీవేంకటాద్రిని దేవకీదేవియు
ఇరవై తే వసుదేవుఁ డేఁచి సంతోసించెను