పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-01 భూపాళం సం: 04-303 వైరాగ్య చింత

పల్లవి:

తెలియఁడుగాక ద్రిష్టము జీవుఁడు
సులభమిదివో యిచ్చోటనే పరము

చ. 1:

మనసునఁ దలచిన మర్మములు గరగి
చొనుపుచు నింద్రియసుఖ మిచ్చు
అనువుగ నిటువలె హరిఁదలపోసిన
తనకు బ్రహ్మానందము సమకొనదా

చ. 2:

మాటలాడినను మరిగి మానవులు
యీటున మెచ్చిత్తురేమైనను
నాఁట నిట్ల హరినామము నొడివిన
గాఁటపువరములు కలుగునె కాదా

చ. 3:

చేసినపుణ్యము చేతఁజుట్టుకొని
రాసి వెనుతగిలి రక్షించు
వేసర కిటు శ్రీవేంకటేశ్వరుని
ఆసల కైంకర్యము ఫలించును