పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-05 వరాళి సం: 04-307 మాయ

పల్లవి:

జీవుఁ డించుకంత చేఁత సముద్రమంత
చేవెక్కి పలుమారుఁ జిగిరించీ మాయ

చ. 1:

కోపములైతేను కోటానఁగోట్లు
దీపనములైతేను దినకొత్తలు
చాపలబుద్దులు సమయని రాసులు
రాపాడీఁ గడవఁగరాదు వోమాయ

చ. 2:

కోరికలైతేను కొండలపొడవులు
తీరనిమోహాలు తెందేపలు
వూరేటిచెలమలు వుడివోనిపంటలు
యీరీతినే యెలయించీని మాయ

చ. 3:

మునుకొన్నమదములు మోపులకొలఁదులు
పెనఁగినలోభాలు పెనువాములు
నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు
యెనసి పరులనైతే యీఁదించీ మాయ