పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0350-02 మధ్యమావతి సం: 04-292 నృసింహ


పల్లవి :

చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా


చ. 1:

సకలదేవతలును జయపెట్టుచున్నారు
చకితులై దానవులు సమసి రదే
అకలంకయగు లక్ష్మి యటు నీ తొడపై నెక్కి
ప్రకటమైన నీ కోపము మానవయ్యా


చ. 2:

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుఁ డభయమడిగీ నదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుఁ గూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా


చ. 3:

హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు.
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మీదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా