పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0350-01 భంగాళం సం: 04-291 విష్ణు కీర్తనం


పల్లవి :

భావించి తెలుసుకొంటే భాగ్యఫలము
ఆవలీవలిఫలములంగజ జనకుఁడే


చ. 1:

దానములలో ఫలము తపములలో ఫలము
మోనములలో ఫలము ముకుందుఁడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
నానాఫలములును నారాయణుఁడే


చ. 2:

వినుతులలో ఫలము వేదములలో ఫలము
మనసులోని ఫలము మాధవుఁడే
దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుఁడే


చ. 3:

సతతయోగ ఫలము చదువులలో ఫలము
అతిశయోన్నత ఫలము యచ్యుతుఁడే
యతులలోని ఫలము జితకామిత ఫలము
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుఁడే