పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0350-03 నారాయణి సం: 04-293 మాయ


పల్లవి :

హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁగదే


చ. 1:

తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు


చ. 2:

మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు


చ. 3:

చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు