పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0343-02 దేవగాంధారి సం: 04-251 విష్ణు కీర్తనం


పల్లవి :

పట్టిన ముట్టనుండరు పదరుదు రంతలోనే
యెట్టనెదుటీమిమ్ము నెరిఁగీ నెరఁగరు


చ. 1:

గుక్కక మూఁడులోకాలు గొలిచితివని నీకు
మొక్కుదురు; పరులకు మొక్కకుండరు
అక్కరదీర శ్రీపతివని నిన్ను వేఁడుదురు
వెక్కసపుఁ దైవాల వేఁడుకోక మానరు


చ. 2:

కందువ బ్రహ్మగన్నట్టి ఘనుఁడవు నీవార-
మందురు; పరులవారమనకుండరు
అంది వేదాలు దెచ్చేయాతఁడవు నీవే యని
యెందు నెంచి, పరులను యెంచకుండరు


చ. 3:

యిత్తల నారదాదుల కేలికని నీమరఁగు
చొత్తురు; పరులమాఁటు చొర కుండరు
అత్తిన శ్రీవేంకటేశ యన్నియు నీమాయలింతే
యెత్తిన వెఱ్ఱులు లోకులిట్టే భ్రమతురు