పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0343-03 లలిత సం: 04-252 శరణాగతి


పల్లవి :

ఇంక నేమిసేసేము యిన్నిటాఁ దనిసితిమి
సంకెలెల్లాఁ దీరెఁ దీరె చాలుఁజాలుఁ గర్మము


చ. 1:

కోరి పుణ్యము లేమైనాఁ గొన్ని సేసేమంటిమా
కోరిక లిచ్చేటి హరి కూడి మాలోనున్నాఁడు
చేరఁ జోటువెదకి పొంచి తిరిగేమంటిమా
చేరేటివైకుంఠపతి చేతిలో నున్నాఁడు


చ. 2:

భవహరముగ వేదపఠన సేసేమంటే
భవహరమగుహరిపాటలు నోట నున్నవి
తవిలి సంపదలకై దానమిచ్చేమంటిమా
భువిలోన శ్రీపతి మాపూజలో నున్నాఁడు


చ. 3:

యిహసుఖములకుఁగా యిందరి వేఁడేమంటే
యిహమిచ్చే శ్రీ వేంకటేశుఁ డెదుట సున్నాఁడు
సహజమయినయట్టి సర్వేశఁ డీతడే
మహిమలన్నియుఁ దానె మాకు నిచ్చినాఁడు