పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0343-01 మలహరి సం: 04-250 భక్తి


పల్లవి :

మానరో వో లోకులాల మాకు మీకు నేమి దోడు
నాఁటికిఁక మీకు నవ్వుఁబాటు నేము


చ. 1:

యిరవై నానోటికి యెన్నెన్ని చదివిన
హరియనేయంతరుచి అందు లేదు
గరిమ నెన్నిరూపులు కన్నుల నేఁ జూచినాను
పురుషోత్తముఁ జూచినపూర్తి యందు లేదు


చ. 2:

యెచ్చోట నుండినాను యిందిరేశుమందిరము
చొచ్చి యుండేసుఖ మంత చొప్పడ దందు
కచ్చుపెట్టి వీనులకుఁ గతలెన్ని విన్నాను
అచ్చుతుకీర్తన వినేయందు సరి రాదు


చ. 3:

కైపుగాఁగ కన్నవారికాళ్ళకు మొక్కినాను
శ్రీపతికిమొక్కినంత సెలవు గాదు
యేపున శ్రీవేంకటేశు విటులఁ బూజించినట్టు
మాపుదాఁకా నితరుల మనసురాదు