పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0337-04 గుండక్రియ సం: 04-217 దశావతారములు


పల్లవి :

ఇరువుగా నిన్నెరిఁగిరి యిదివో నీదాసులు
పరదైవములమీఁద నొల వేయనేల పనిలేవు నీమాయలు కరుణానిధీ


చ. 1:

ముంచెను నీపాదములు మూఁడులోకములయందును
యెంచెను నీ వేయినామాలు యిలలో వేదవ్యాసుఁడు
చంచులఁ దలఁచిరి నిన్ను మున్నే సనకాదియోగీంద్రులు
పొంచి యింకా నీకు దాఁగఁ జోటు లేదు యిందు బొడచూపవే యింకవెడమాయలేలా


చ. 2:

కొనెను నీపాదతీర్థము బ్రహ్మ కోరి నీపాదము గడిగి
వినుతించె నీమహిమ తొల్లె వేయినోళ్లుగల శేషుఁడు
అనిరి నిన్నెక్కుడనుచు మొదల శుకాది మునీంద్రులెల్లా
పొనిగి నీవు మాయ సేయఁ జోటు లేదు మమ్ము పొసఁగి యేలుకోవె పురుషోత్తముఁడా


చ. 3:

యెక్కెను ధ్రువుఁడు పట్టము యిదివో నిన్నుఁ గొలిచి
చిక్కెను నీశరణాగతి నేఁడు శ్రీవైష్ణవులచేతను
గక్కన శ్రీవేంకటేశుఁడా యిట్టె కాచితివి మాటకే మమ్ము
యిక్కడ నీమాయసేయఁ జోటులేదు నిన్నునెలఁగిరి నీదాసులిందిరారమణా