పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0337-03 శోకవరాళి సం: 04-216 మనసా


పల్లవి :

విడువుము మనసా వీరిడిచేఁతలు
తడయక శ్రీహరిఁ దలఁచవొ యిఁకను


చ. 1:

నానాఁడే యెనఁబది నాలుగు లక్షలు
యోనుల వెడలితి నొక్కఁడనే
ఆనిన భోగములందలివే పో
కానము యిఁకనేమి గడియించేము


చ. 1:

నలుగడ నటు పదునాల్గు లోకములు
వెలయఁ జొచ్చితిని వెడలితిని
కలిగినదేదో కలుగనిదేదో
తెలియ దేమిటికిఁ దిరిగేవమో


చ. 1:

భువిలోఁ జేసితి పుణ్యముఁ బాపము
కవిసి యాఫలము గైకొంటిని
యివల శ్రీవేంకటేశుఁడింతలో
తవిలి యేలఁగా ధన్యుఁడనైతి