పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0337-05 హిజ్జిజ్జి సం: 04-218 అధ్యాత్మ


పల్లవి :

పాపముఁ బుణ్యము పరగ నొకట నదె
వోపినవారలు వొడిఁగట్టెడిది


చ. 1:

నాలుకతుదనే నానారుచులును
నాలుకవే హరినామమును
పోలింప నొక్కటి భోగమూలము
మూల నొకటది మోక్షమూలము


చ. 2:

మనసున నదివో మగువలమోహము
అనుగుమనసుననె హరిచింత
పనివడి యొక్కటే ప్రపంచమార్గము
కొన నొకటే వైకుంఠమార్గము


చ. 3:

వెలుఁగుఁ జీఁకటియు వెస నొకనాఁడే
కలిగె నట్ల నివి కలిగినవి.
యిలలో శ్రీవేంకటేశు మా యొకటి
తలఁప నొక టతనిదాసులసుగతి