పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0335-03 బలహంస సం: 04-204 వైరాగ్య చింత

పల్లవి: ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయ రాదా
సామజగురుఁడ నీతో సంగమొల్ల దేఁటికే

చ. 1: మాయలసంసారము మరిగిన కర్మము
ఈయెడ నిను మరుగ దేఁటికో హరి
కాయజకేలిపైఁ దమిగలిగిన మనసు
కాయజుతండ్రి నీపైఁ గలుగ దిదేఁటికే

చ. 2: నాటకపుఁగనకము నమ్మినట్టిబదుకు
యేఁటికి నీభక్తి నమ్మదేలే హరి
గూఁటఁబడే పదవులు గోరేటిజీవుఁడు
కూటువైననిజముక్తి గోరడిఁది యేఁటికే

చ. 3: పాపపుణ్యములకె పాలుపడ్డ నేను
యేపున నీపాలఁ జిక్క నేలకో హరి
శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుఁడ
నీపేరివాఁడ నాకు నిండుమాయ లేఁటికే