పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0335-02 నారాయణి సం: 04-203 అధ్యాత్మ

పల్లవి: ఏలికవు నీవట యింకా దైన్యమేల
తాలిమి నీచేఁతలకుఁ దగవు గాదనరా

చ. 1: ఘనకర్మానుభవమే కావలె నొండె నాకు
వనజాక్ష నీసేవే వలె నొండె
కినుకఁ బూఁటయు సంకెలయు రెండు నేల
ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మీ

చ. 2: పైకొని నేఁ జేసినపాపమె కావలె నొండె
తూకొని నీనామముచేఁ దుంచుట యొండె
సాకిరి చంకదుడ్డు శరణార్తి రెండు నేల
మేకొని యీవట వింటే మెత్తురా నిన్నును

చ. 3: యిరవుగా మరపొండె యెరుక గావలె నొండె
సరస రెండును నైన సంగతౌనా
గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను
సరిబేసి జంటమాట జరపకు మిఁకను