పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0335-04 దేసాళం సం: 04-205 వేంకటగానం

పల్లవి: తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక
యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు

చ. 1: యీ సంసారమునకు యితఁడె దిక్కు నేఁ-
జేసేటిచేఁతలకెల్ల శ్రీపతే లోను
పాసిపోఁడెప్పుడు నన్ను బందువుఁడితఁడే నాకు
దాసుఁడైనవాఁడు హరిఁ దగదు దూరఁగను

చ. 2: చావుఁబుట్టుగులవేళ సతము నీతఁడే
సావి భోగములకు నిచ్చకుఁడీతఁడే
భావములోపల నుండుప్రాణ మీతఁడే నాకు
దైవము దూరగనేల తనకేమి వచ్చినా

చ. 3: తలఁపులోపలికి యీదైవమే తోడు
యిలఁ గలిమిలేములు కీతఁడే తోడు
పలుకులోపల నుండుభాగ్య మీతఁడె నాకు
కొలిచి శ్రీవేంకటేశుఁ గొసరఁగనేఁటికి