పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0334-01 సామంతం సం: 04-196 శరణాగతి


పల్లవి :

ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె వున్నది చెప్పరాని ఫలము


చ. 1:

కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా


చ. 2:

ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము


చ. 3:

కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలే యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి