పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0333-06 శుద్ధవసంతం సం: 04-195 శరణాగతి


పల్లవి :

కటకటా యీ ప్రాణి గతిగనుట యెన్నఁడో
అటు నావశము గాదు హరి నీచేఁ గాని


చ. 1:

పాపము నెరుఁగుదు బంధము నెరుఁగుదు
మాపుదాకా నివి నేను మానలేఁగాని
కోపము దుర్గుణమని కొంత గొంత యెరుఁగుదు
తీపుల యాసలఁ బడి తిప్పలేఁగాని


చ. 2:

చూతును దుఃఖాలవారిఁ జూతును బుట్టేవారి
యీతల నాకు వెరపు యించుక లేదు
గాతల నామనసెల్లఁ గల్పించినట్లవును
చేతనైనా చెప్పినట్టు సేయలేఁగాని


చ. 3:

నావంకఁ గడమ గాఁక నా గురుఁడు తొల్లె నన్ను
శ్రీవేంకటేశుఁడ నీచేతికిచ్చెను.
దైవమొక్కఁడవే నీ దాసానుదాసుఁడనైతి
యేవిధులు నే నెరఁగ నిటు నిన్నేకాని