పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0333-05 శంకరాభరణం సం: 04-194 శరణాగతి


పల్లవి :

నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు
యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను


చ. 1:

కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు
పన్నినలక్ష్మిభూమిపతివి నీవు
అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యాదివేలుపవు
యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను


చ. 1:

దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
ఆవలఁ బాదాన లోక మణఁచితివి
నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు
యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను


చ. 1:

అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి
సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ
పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు
యిరవైననీవేకాక యెవ్వరున్నా రిఁకను