పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0335-02 గుజ్జరి సం: 04-191 శరణాగతి


పల్లవి :

ఇతరోపాయములెల్ల యీసందివే
అతిశయపదమైతే హరిదాస్యఫలమే


చ. 1:

కర్మము సేయ నేరరా కడఁగి సన్యాసులు
కర్మము విడిచి మోక్షముఁ బొందిరి
ధర్మమెరఁగనివారా తత్వపుయోగీంద్రులు సర్వ-
ధర్మము విడిచి హరిఁ దమలోనే కనిరి


చ. 2:

దానాలు సేయనేరరా తగిలి యోగీంద్రు లన్ని
మాని హరిజపమే నెమ్మడిఁ జేసిరి
నానావిధు లెరఁగరా నాఁడు విభీషణాదులు
శ్రీనాథు శరణని చిరదేహులైరి


చ. 3:

సతతసంగములెల్ల జన్మబంధహేతువని
మతిమంతులైనవారు మానిరిగాక
హితవైన శ్రీవేంకటేశ్వరుని శరణని
బ్రతుకరా యిందు నందుఁబ్రపన్నులెల్లను