పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0333-01 గుండక్రియ సం: 04-190 మనసా


పల్లవి :

అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము
యెన్నఁడు గాననిమాయ యెరఁగవో మనసా


చ. 1:

యీడనే సంసార మీదే యింద్రజాలమై యుండఁగ
యేడకైనాఁ జూడఁ బోయే మింద్రజాలము
పాడితో నా పట్టుగులే బహురూపాలై యుండఁగ
వేడుకయ్యీ బహురూపవిద్యలు చూడఁగను


చ. 2:

నటన దినదినము నాటకమై యుండఁగాను
సటవట నాటకాలు సారెఁ జూచేము
ఘటన మాయలెదుటఁ గనుకట్టై వుండఁగాను
అటమటపువిద్యలు అన్నియుఁ జూచేము


చ. 3:

పాపపుణ్యములు రెండు బారివిద్య లుండఁగాను
కోపుల నాటలవారిఁ గోరి చూచేము
యేపున శ్రీవేంకటేశు డిటు మమ్ము భ్రమపాపె
నాపనులు నేనే చూచి నవ్వులు నవ్వేను