పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0332-06 దేవగాంధారి సం: 04-189 శరణాగతి


పల్లవి :

పుట్టించినవాఁడు దానే బుద్ధిచెప్పేవాఁడు దానే
యిట్టె శ్రీహరి నన్నేట్టీడేరించీనో


చ. 1:

యెంచుకొందు నొకవేళ నేఁటి సంసారమిదని
యించుకవడిలోనే మోహింతు నందుకు
కంచువంటి దీమనసు కటకటా యేది వాటి
చంచలుఁడ హరి నన్నేసంగతి సేసీనో


చ. 2:

తలఁతు నేనొకవేళ దైవము గనేనని
కలిమి నంతటిలోనె కడు మరతు
చలపట్టె నిదివో నాజన్మములకేది వాటి
కలుషచిత్తుఁడ నన్నేకందువఁ బెట్టీనో


చ. 3:

జ్ఞానినౌదు నొకవేళ సరిఁ గర్మినౌదును
మానువంటిదీగుణము మరేది వాటి
కోనల శ్రీవేంకటేశుఁ గొలిచి నే శరణంటి
మానిసి నింతే యెట్టు మన్నించీనో