పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0333-03 సౌరాష్ట్రం సం: 04-192 అన్నమయ్య స్తుతి


పల్లవి :

హరియవతారమె ఆతఁడితఁడు
పరమ సంకీర్తనఫలములో నిలిపె


చ. 1:

వున్నాఁడు వైకుంఠమున నున్నాఁడు యాచార్యునొద్ద
వున్నతోన్నతమహిమ నన్నమయ్య
వున్నవి సంకీర్తనాలు వొట్టుక లోకములందు
పన్నిన నారదాదులు పైపైఁ బాడఁగను


చ. 2:

చరియించు నొకవేళ సనకాదిమునులలో
హరిఁ బాడుఁ దాళ్ళపాక అన్నమయ్య
తిరమై యాళువారల తేజము దానైయుండు
గరుడనంతముఖ్య ఘనులంగడిని


చ. 3:

శ్రీ వేంకటాద్రిమీఁద శ్రీపతికొలువునందు
ఆవహించెఁ దాళ్ళపాక అన్నమయ్య
దేవతలు మునులును దేవుఁడని జయపెట్టఁ
గోవిదుఁడై తిరిగాడీఁ గోనేటిదండను