పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-05 నాదరామక్రియ సం: 04-176 దేవుడు జీవుడు


పల్లవి :

కొసరనేల నాగుణము లివి
రసికత నీవిన్నిటా రక్షించుకొనుమీ


చ. 1:

నేరమి నాది నేరుపు నీదే
దూరు నాది బంధుఁడవు నీవు
కోరుదు నేను కొమ్మని యిత్తువు
కారుణ్యాత్మక గతి నీవు సుమీ


చ. 2:

నేను యాచకుఁడ నీవేదాతవు
దీనుఁడ నేఁ బరదేవుఁడవు
జ్ఞానరహితుఁడను సర్వజ్ఞనిధివి
శ్రీనిధి యిఁక ననుఁ జేరి కావుమీ


చ. 3:

అరయ నే జీవుఁడ నంతర్యామివి
యిరవుగ దాసుఁడ నేలికవు
చిరంజీవిని నే శ్రీవేంకటపతివి
వరదుఁడ ననుఁ జేవదలకుమీ