పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-04 జౌళిరామక్రియ సం: 04-175 నృసింహ


పల్లవి :

ఎంత పరాక్రమము యీసింహము
చెంతనే దివిజులు సేవించేరు


చ. 1:

కొండమీఁదఁ గూచుండి దైత్యుమై
చెండివేసె నీ సింహము
నిండునగవుతో నెలఁత దనతొడపై
నుండఁగ నెరసీ నుదుటుఁదనమున


చ. 2:

తటుకనఁ బ్రహ్లాదుఘటనచేఁ గంభము
వెడలె నీ సింహము
చటుల కరంబులఁ గుటిలదానవుని
బటుగతిఁ బట్టెను పశుబంధముగా


చ. 3:

పగయెల్ల నడఁచి జగములేలుచును
జిగిమించిన నరసింహము
నిగిడి శ్రీవేంకటనిధి యహోబలము
తగు నివాసముగఁ దనరీ నిదివో