పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-03 కురంజి సం: 04-174 భక్తి


పల్లవి :

చేపట్టుఁ గుంచము శ్రీవిభుఁడు
వై పెరిఁగి పొగడవలెఁ గాక


చ. 1:

మనసులోనిహరి మరవక తలఁచిన
యెనయ నిహపరము లేమరుదు
పెనగొన నాతనిపేరు నుడిగినను
తనకు మహానందము లేమరుదు


చ. 2:

పుట్టించినాతని పొసఁగఁగ గొలిచిన
యిట్టె వివేకం బేమరుదు
చుట్టి యతనిదాసులకు మొక్కినను
పుట్టగు గెలుచుట భువి నేమరుదు


చ. 3:

శ్రీవేంకటేశ్వరుఁ జేరి భజించిన
యేవేళ సాత్విక మేమరుదు
భావించి యాతనిపై భక్తి నిలిపినను
కైవశముగఁ దనుఁ గను టేమరుదు