పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0330-02 మేఘరంజి సం: 04-173 శరణాగతి


పల్లవి :

వట్టిజాలిఁ బడవలదిఁకను
గట్టి విచారముగల వారికిని


చ. 1:

దేవుఁడు సులభుఁడు తెలియఁగనేర్చిన
వేవేలు లాభము విరతి
భావించు జ్ఞానమె పాదైన సౌఖ్యము
తావగు శాంతమే ధనధాన్యములు


చ. 2:

గురుఁడె సాధనము కోరి వెదకినను
పరగు నాచారమె బ్రదుకెల్లా
శరణాగతియై సామ్రాజ్యపదవి
ధర జితేంద్రియత్వమే వైభవము


చ. 3:

తననిజభక్తియె దండయు దాపును
మనసు నిలుపుటే మరి శుభము
యెనయఁగ శ్రీవేంకటేశుమహిమ లివి
కని మనియండుటె ఘనవివేకము